Thursday, December 20, 2018

సిద్దార్థ కట్టా "ఒక" దీపం

సిద్దార్థ కట్టా "ఒక" దీపం


సిద్దార్థ కట్టా. తను ఓ కవి అని నాకు తెలిసింది కొన్ని నెలల క్రితం మాత్రమే. అంతకుముందు దాకా ఇంటర్మీడియట్ అనంతర తమ తమ జీవితాల్లో తప్పిపోతున్న ఎందరో మిత్రుల్లో అతనొకడు.  కవిత్వాన్ని నేర్పే కవిసంగమమే మళ్ళీ సిద్దార్థను చూపించి నాకో కవిమిత్రుడినిచ్చింది.
ఆ తర్వాత కలవటం, "ఒక" పుస్తకం తీసుకోవటం, రెండ్రోజుల్లో చదవటం అయిపోయింది.
నిజానికి నేను అప్పుడప్పుడే కవిత్వం చదువుతున్న రోజులవి. అప్పట్లో సిద్దార్థ కవిత్వం చాలా వరకు అర్థం కాలేదు. కానీ అర్థం అయినవి మాత్రం ఇప్పటికీ నన్ను వదల్లేదు. మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. చదివిన ప్రతిసారి కొత్త అనుభూతులు ఆస్వాదిస్తున్నాను.
ఈ ఒక  చదువుతున్నంత సేపూ ఎలా వుంటుందంటే.. కొన్ని పేజీలు తిప్పుతుంటే చేతికి నెత్తుటి జీర అంటుకుంటుంది, కొన్ని పేజీల్లో చిన్ని పాప కోరికలు వినిపిస్తాయి, ఇంకొన్ని పేజీలు తడిగా తగులుతూ.. ఇవి మనుషుల హృదయాల్లోని సముద్రాలని చెప్తాయి.
అంతేనా..!
బాల్కనీ బుగ్గపై వాలిన మల్లెచెట్టు గుబాలింపులూ..
పాపాయి ఏడుపుకు తలతిప్పే మనుషుల హృదయాలూ..
ప్లాస్టిక్ పూలు కోరుకునే పాప మనసూ..
పుస్తకం మూసేసినా కూడా వెంటాడుతాయి
ఈ సిద్దార్థ "ఒక" తన కళ్ళద్దాలు.. అవి మనకిస్తాడు. నిరంకుశ లాఠీలని చూపిస్తాడు, నిలదీతల్ని వినిపిస్తాడు, తన సిద్ధాంతాన్ని చదవమని, వెలగమని చెప్తాడు..
అలాగే ఓ కవితలో ఇలా చెప్తాడు..
"కాలం ఎవరో వెలిగించిన దీపపు ప్రమిద
మనిషి వెలుతురు చుట్టూ తిరిగే రెక్కల పురుగు" అని.
ఆ వెలుతురును చిమ్మే ఓ దీపమే ఈ ఒక అని అంటాన్నేను.

-శ్రీ వశిష్ఠ సోమేపల్లి