Monday, July 22, 2019

కలల హంతకులు

కలల హంతకులు



కొత్త చిగురుకు సొంత కలలా!
ధడేల్
కిటికీలు మూసేసారు
కలల గాలుల స్వరాలు
ఆ చెవులకు కీచు శబ్ధాలయ్యాయేమో!?

ఐనా ఆ స్వరాలు చొచ్చుకొచ్చాయి
పగుళ్లు సందులను సున్నితంగా తాకుతూ..
కానీ వాళ్లకు వికృత అస్వస్థ శబ్ధాలుగా
తాకాయా కలలు
అచ్చం
వయోలిన్ ను  రంపంలా కోస్తున్నట్టు

ఈ కలలను ఆపేదెలా?
కిటికీ తీసేస్తే పోలా!
సంతృప్తిగా నవ్వుతూ..
ఓ కలల హంతకుడు పుట్టాడు

ఇక ఈ ఎయిర్ టైట్ గదిలోనే
ఆ చిగురు మానయ్యేది
స్వేచ్ఛా కలలు వీచవు
అన్ని కలలూ ఏసీనే నిర్దేశిస్తుంది
రిమోట్ హంతకుని చేతిలో..

తమవి కాని కలల్ని చంపేసే ఫాసిస్టును,
మరో కలల హంతకున్ని తయారు చేసే ఓ
వికృత ప్రక్రియ ఇది.
ఎంత హింస! ఎవరికీ కనిపించదా?
కలల హంతకుల లోకంలో హత్య ఒప్పేనా..!
కలమేధాలు ఎంత నిత్యమైతే మాత్రం
కాలం సత్యమే అని అంటుందా..!?

ఓ వైపు
ఆ చిగురు..
ఇనుప కమ్మీలు లేని స్వేచ్ఛా సమాజంలో
రెక్కలు విరిగిన చిలుకై నడుస్తూ..
రెక్కలు విప్పార్చలేని బతుకెందుకని
కిటికీని కప్పిన గోడకేసి
తల బాదుకుంటుంది..

మరో వైపు
తన స్వప్నాలు భారంగా ఉరిమి
కన్నీరై కురిసి నానుస్తున్నాయి ఆ గోడను

ఇక ఖశ్చితంగా పగలాల్సిందే..
తలో..గోడో..!

No comments:

Post a Comment