Monday, July 22, 2019

పాటంటే మాటలా...


పాటంటే మాటలా…!

నిజానికి కర్ణభేరి పై తాళం వేయటం వరకే ఈ పాటల పని!
కానీ దాహంగా ఉందేమో
నా తడి హృదయాన్ని తాగటానికి
లోపలికి వచ్చేసిందా పాట...

వచ్చి ఊరుకోకుండా గిటార్ తీగలను లాగినట్టు
ఎదనల్లుకున్న జ్ఞాపకాల లతల్ని మీటుతోంది..
అదలా లాగి వదులుతుంటే
తీపిగా తరంగాలు ఎగిరి బరువులై
మనసుని లోతుల్లోకి జార్చి జార్చి
నిద్రపోతున్న మడుగులో బొట్టుగా పడేశాయి..

అంతే!
కొలను కడలై జ్ఞాపకాల అలలు రేగాయి
అప్పటి నువ్వుని ఓ సారి చూడూ అంటూ
ఓ కెరటం మది పాదాల్ని నిమిరింది
అటు చూసే లోపు
అప్పటి కలల్నీ ఓ సారి చూడమంటూ మరో అల నవ్వింది-
మనుషులే కాదు స్వప్నాలు మారిపోతాయి అన్నట్టు

పాత కలే కదా ఓ ముద్దు పెడదాం
అని హత్తుకోబోతుంటే..
ఎన్నో మరెన్నో అలలు
ఓ సారి ఎత్తుకోమంటూ ఎగిసి వస్తున్నాయి!

చిన్న బిందువే కదా అనుకుంటే
సంద్రమంత లోతుకు లాక్కెళ్ళింది..
అణువంత చెమ్మ అనుకుంటే
ఈదలేని ఊటై మింగేస్తోంది..
అందుకే చెవిలోంచి ఇయర్ ఫోన్ తీసేశాను అర్థాంతరంగా

కానీ అప్పటికే మునిగేశానాయే!
నా మనసుతడి తాగటానికి వచ్చిన ఓ గేయం
గురుతుల్ని పొడిచి పొడిచి మరింత తడి చేసి వెళ్ళిపోయింది

అందుకే
కొన్ని పాటలు ఎప్పటికీ పూర్తిగా వినలేను


No comments:

Post a Comment